విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం: కమల్ హాసన్
- 717 మద్యం దుకాణాలను మూసివేయడం పట్ల కమల్ అభినందన
- దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందని వ్యాఖ్య
- విజయ్ను కేవలం నటుడిగా మాత్రమే చూడవద్దన్న కమల్
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, తన సహచర నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాలపై విశ్వనటుడు కమల్ హాసన్ ప్రశంసల జల్లు కురిపించారు. విజయ్ సీఎం పదవిని చేపట్టడం కేవలం ఒక నటుడిగా తనకు గర్వకారణం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కమల్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న సామాజిక నిర్ణయాలను కమల్ స్వాగతించారు. ముఖ్యంగా తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న ఈ షాపులను తొలగించడం వల్ల సమాజానికి మంచి జరుగుతుందని, ఇటువంటి చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలని కమల్ సూచించారు.
విజయ్ను ఇప్పుడు కేవలం ఒక నటుడిగానే చూడవద్దని, ఆయనకు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అనే పెద్ద బాధ్యతలు ఉన్నాయని కమల్ గుర్తుచేశారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అభినందించిన కమల్, పాలనలో కూడా ఆయనకు తన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు.